: ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి ఎమ్మా స్టోన్... మూడో స్థానానికి పడిపోయిన జెన్నిఫర్ లారెన్స్!
గత రెండేళ్లుగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా మొదటి స్థానంలో నిలిచిన జెన్నిఫర్ లారెన్స్ మూడో స్థానానికి పడిపోయారు. ప్రపంచంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణుల జాబితాను ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసింది. 26 మిలియన్ డాలర్ల సంపాదనతో ఎమ్మా స్టోన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఉత్తమ నటిగా `లా లా ల్యాండ్` చిత్రానికి ఎమ్మా స్టోన్ ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే.
25.5 మిలియన్ డాలర్ల సంపాదనతో జెన్నిఫర్ ఆనిస్టన్ రెండో స్థానంలో నిలవగా, 24 మిలియన్ డాలర్ల సంపాదనతో జెన్నిఫర్ లారెన్స్ మూడో స్థానానికి పడిపోయారు. తర్వాత స్థానాల్లో వరుసగా మెలీసా మెక్‌కార్తీ, మిలా కునిస్, ఎమ్మా వాట్సన్, చార్లీజ్ థెరాన్, కేట్ బ్లాంచెట్, జూలియా రాబర్ట్స్, ఆమీ ఆడమ్స్ నిలిచారు. వారాంతంలోగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించనున్నట్లు సమాచారం. గతేడాది ఈ జాబితాలో 64.5 మిలియన్ డాలర్ల సంపాదనతో డ్వేన్ జాన్సన్ మొదటి స్థానంలో నిలిచిన సంగతి విదితమే.