: రోజా అంటే ఏంటో మీకు తెలుసా?.. రోజాపై కమెడియన్ వేణు మాధవ్ సెటైర్లు


టీడీపీకి వీరాభిమాని అయిన సినీ కమెడియన్ వేణు మాధవ్ నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తనదైన శైలిలో ప్రసంగిస్తూ ఓటర్లను ఆకట్టుకున్నాడు. భూమా కుటుంబం తనకు సొంత కుటుంబంలాంటిదని ఈ సందర్భంగా ఆయన చెప్పాడు. మంత్రి భూమా అఖిలప్రియ తన అన్న బిడ్డ అని, తనకు కుమార్తెలాంటిదని తెలిపాడు. వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రచారం టీడీపీకి లాభిస్తోందని... ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఎప్పటికీ చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనకే ఓటర్లంతా మద్దతును ప్రకటించాలని పిలుపునిచ్చాడు.

ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాపై వేణుమాధవ్ సెటైర్లు విసిరాడు. 'నా బిడ్డ అఖిలప్రియపై ఎవరో ఏదో కామెంట్ చేశారట' అన్న వేణుమాధవ్... ఎవరామె? ఏం చేస్తుంటుంది? అంటూ చుట్టూ ఉన్న అభిమానులను అడిగాడు. దానికి సమాధానంగా అక్కడున్నవారంతా 'రోజా' అంటూ గట్టిగా అరిచారు. దీంతో, రోజా అంటే మీకు అర్థం తెలుసా? అంటూ ప్రశ్నించి... రోజాకు కొత్త నిర్వచనం చెప్పాడు. 'రోజా' అంటే 'రో' యహాసే 'జా' (ఏడ్చుకుంటూ ఇక్కడ నుంచి వెళ్లు అని తెలుగులో అర్థం) అని తెలిపాడు. టాటూలు వేసుకుని, చిన్నచిన్న డ్రస్సులు వేసుకుని, డ్యాన్సులు చేసుకుంటూ ఉండే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని... అలాంటి అసభ్యకరమైన మాటలు తాను మాట్లాడనని అన్నాడు. ఆడవాళ్లంటే తనకు ఎంతో గౌరవమని... వారిపై తాను ఎలాంటి విమర్శలు చేయనని చెప్పాడు.

ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వేణుమాధవ్ విన్నవించాడు. గుర్తు తెలియని వారే వారి గుర్తును పట్టుకుని తిరగుతారని... మనకు ఏం అవసరం తమ్మి? అని అన్నాడు. (రోడ్ షోలో ఇదే మన గుర్తు అంటూ ఫ్యాన్ ను ఓటర్లకు జగన్ చూపిస్తున్న సంగతి తెలిసిందే). మన గుర్తు మన గుండెల్లోనే ఉందని చెప్పాడు. గుర్తులు పట్టుకుని తిరగాల్సిన అవసరం మనకు లేదు అని అన్నాడు. టీడీపీ గెలుపు గురించి ఇప్పుడు ఎవరికీ రెండో ఆలోచన లేదని... ఎంత మెజార్టీ అనేదే టెన్షన్ అని వేణుమాధవ్ చెప్పాడు.

 తాను ప్రచారానికి రాలేదని... టీడీపీకి ఎంత మెజార్టీ వస్తుందో చూద్దామనే వచ్చానని అన్నాడు. యువకుడు, అందగాడు, బాగా పని చేసే వ్యక్తి భూమా బ్రహ్మానందరెడ్డి అని... కాకపోతే తనకంటే ఒక అడుగు ఎత్తుగా ఉంటాడని సరదాగా వ్యాఖ్యానించాడు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కని విధంగా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని విన్నవించాడు. అక్కా, బావా అంటూ... తెలుగు, హిందీలో వేణుమాధవ్ చేసిన ప్రచారం అభిమానులను ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News