: వైస్ కెప్టెన్సీ బాధ్యతను నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను: రోహిత్ శర్మ
శ్రీలంకతో వన్డే జట్టులో స్థానం సంపాదించుకోవడం ఆనందంగా ఉందని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. టీమిండియాకు ఎంపికైన అనంతరం ముంబైలో రోహిత్ మాట్లాడుతూ, టీమిండియా వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికవ్వడం తనకు లభించిన అత్యంత గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. పదేళ్ల క్రితం తాను టీమిండియాకు ఎంపికైతే చాలు అనుకునేవాడినని గుర్తుచేసుకున్నాడు. అలాంటిది తనను జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం గొప్ప విషయమేనని రోహిత్ అన్నాడు.
అయితే దీని గురించి పెద్దగా ఆలోచించకుండా ఆటను ఆస్వాదించాలనుకుంటున్నానని చెప్పాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు సారథ్యం వహించడం, టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం విభిన్నమైన అంశాలని చెప్పాడు. ఐపీఎల్ కు, అంతర్జాతీయ క్రికెట్ కు చాలా తేడా ఉందని చెప్పాడు. అయితే స్ఫూర్తి మాత్రం ఒకటేనని అన్నాడు. తన పదేళ్ల కెరీర్ లో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని రోహిత్ చెప్పాడు. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు నేర్చుకున్నానని అన్నాడు. రిజర్వ్ బెంచ్ లో కూర్చునేందుకు ఎవరూ ఇష్టపడరని, అయితే జట్టు కూర్పును బట్టి ఒక్కోసారి తప్పదని చెప్పాడు. శ్రీలంకపై తన రికార్డును కొనసాగిస్తానని రోహిత్ శర్మ తెలిపాడు.