: ఈ విషయాన్ని బాలకృష్ణ గారు గమనించాలి: ఎమ్మెల్యే రోజా
తల్లి పాలు తాగి రొమ్ములు గుద్దేసింది భూమా నాగిరెడ్డే అని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నంద్యాల రోడ్ షోలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రోజా ఘాటు కౌంటర్ ఇచ్చారు. "బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు ఆయనకు ఒకవైపు అఖిల ప్రియ, మరోవైపు అమరనాథ్ రెడ్డి, వెనకాల ఆదినారాయణరెడ్డి గారు ఉన్నారు. మధ్యలో నిలబడ్డ బాలకృష్ణ గారు మాట్లాడుతూ, ‘శిల్పా చక్రపాణి గారికి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం.. తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు వాళ్లు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో వాళ్లను ఓడించండి.. ఓట్లెేయవద్దు’ అన్నారు. తల్లిపాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు అనే విషయాన్నిబాలకృష్ణ గట్టిగా చెబితే, ఆయన పక్కన ఉన్నవాళ్లకు గుండెనొప్పి వచ్చి ఉంటుంది ... ఎందుకంటే, వైసీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకువెళ్లి, వారితో ఇంతవరకూ రాజీనామా కూడా చేయించలేదు. ఈ రోజున బాలకృష్ణతో అలా మాట్లాడించి, ప్రజల్లో చులకన చేయడమనేది చంద్రబాబునాయుడుగారు చేస్తున్న పని. ఈ విషయాన్ని బాలకృష్ణ గారు గమనించాలి’ అని రోజా పేర్కొన్నారు.