: ప్రపంచ మరుగుజ్జు క్రీడల్లో సత్తా చాటిన భారత అథ్లెట్లు!
కెనడాలోని టొరంటోలో జరిగిన 7వ ప్రపంచ మరుగుజ్జు క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటారు. వివిధ క్రీడల్లో 37 పతకాలను వీరు గెల్చుకున్నారు. వీటిలో 15 స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఈ ఆటల్లో 24 దేశాలకు చెందిన 400 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కెనడాలోని భారత దౌత్యకార్యాలయం వీరిని సత్కరించింది. ఈ సందర్భంగా తమ కంటూ ఒక ఒలింపిక్స్ లాంటి క్రీడల్ని నిర్వహించినందుకు కెనడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
వీరిలో ఒక్కొక్కరు వివిధ ఆటల్లో పాల్గొని పతకాలు గెల్చుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత దేశానికి 15 బంగారు పతకాలను బహుమతిగా ఇస్తున్నామని భారత మరుగుజ్జు క్రీడాకారుల బృందం తెలిపింది. వీరంతా ఈ ఆటల్లో పాల్గొనడానికి లోన్లు తీసుకుని కెనడా వరకు వచ్చినట్లు వారు చెప్పారు. ప్రభుత్వం వారిపై దృష్టి సారించాలని కోరారు. హోటల్లో ఉండటానికి డబ్బులు లేక, ఫేస్‌బుక్ ద్వారా అర్థిస్తే కెనడాకు చెందిన భారత స్వచ్ఛంద సంస్థ శృంగేరీ విద్యా భారతి ఫౌండేషన్ వారు సహాయం చేసేందుకు ముందుకొచ్చారని వారు వివరించారు.