: బౌన్సర్ కు ‘పాక్’ యువ క్రికెటర్ బలి!
బౌన్సర్ దెబ్బకు మరో యువ క్రికెటర్ జుబైర్ అహ్మద్ బలి అయిన విషాద సంఘటన పాకిస్థాన్ లో జరిగింది. పాక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మార్డన్ లో జరిగిన టీ20 మ్యాచ్ లో క్వెట్టా బియర్స్ జట్టు తరపున జుబైర్ ఆడుతున్న సమయంలో ప్రత్యర్థి బౌలర్ విసిరిన బంతి అతని తలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. జుబైర్ మరణం ద్వారా ఆటగాళ్లకు భద్రత ముఖ్యమనే విషయాన్ని మరోమారు గుర్తుచేస్తోందని, ఆట ఆడే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించిన పీసీబీ, జుబైర్ అహ్మద్ కుటుంబానికి తన సంతాపం తెలిపింది. కాగా, గతంలో జరిగిన ఆస్ట్రేలియా దేశవాళీ టోర్నీలో క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, ప్రత్యర్థి జట్టు బౌలర్ సీన్ అబాట్ వేసిన బౌన్సర్ ను ఆడబోయి మృత్యువాత పడ్డాడు.