: తన కొడుకుల కోసం వచ్చిన మోడల్ ను కొరడా తీసుకుని చితక్కొట్టిన జింబాబ్వే అధ్యక్షుడి భార్య!
తన కుమారులతో మాట్లాడేందుకు వచ్చిన ఓ మోడల్ ను జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే భార్య, ఆ దేశ ప్రథమ పౌరురాలు గ్రేస్ ముగాబే దారుణంగా కొట్టారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, తన వైద్య చికిత్స నిమిత్తం మెడికల్ వీసాపై గ్రేస్ ముగాబే దక్షిణాఫ్రికాకు వెళ్లారు. జొహన్నెస్ బర్గ్ లోని ఓ హోటల్ లో వారు మకాం వేశారు. ఆ సమయంలో గ్రేస్ తనయులతో మాట్లాడేందుకు ఓ మోడల్ వచ్చింది. కుమారులు ఉన్న గదిలోకి వెళ్లి వారితో మాట్లాడుతుండగా, విషయం తెలుసుకున్న గ్రేస్, ఆగ్రహంతో అక్కడికి వెళ్లారు.
కుమారులు, ఆ మోడల్ పై అనుమానంతో ఆమె విరుచుకుపడ్డారు. కొడుకులు వారిస్తున్నా వినకుండా కొరడా తీసుకుని ఆమెను బాదేశారు. జరిగిన ఘటనపై పోలీసులకు సదరు మోడల్ ఫిర్యాదు చేయగా, అరెస్ట్ చేసే నిమిత్తం పోలీసులు వెళ్లేసరికే ఆమె జింబాబ్వేకు వెళ్లిపోయారు. ఈ విషయమై తమ విదేశాంగ శాఖ జింబాబ్వేతో చర్చిస్తోందని సౌతాఫ్రికా వెల్లడించింది. ప్రస్తుతం గ్రేస్ ముగాబే ఎక్కడున్నారన్న విషయమై స్పష్టత లేకపోగా, గతంలోనూ ఆమె విదేశీ పర్యటనలో ఓ వ్యక్తిపై దాడి చేసి, పోలీసులు వచ్చేలోగానే జింబాబ్వేకు పారిపోయిన సంగతి తెలిసిందే.