: వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి!: డీకే అరుణపై ఆమె తమ్ముడు ఫైర్!
తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణపై ఆమె తమ్ముడు, మక్తల్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తమ తండ్రి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి 12వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు అరుణ తన అనుచరులతో కలసి మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలోని రామ్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చారు. అరుణ తన ఇంటికి రావడాన్ని జీర్ణించుకోలేని రామ్మోహన్ రెడ్డి ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శవ రాజకీయాలు చేయడానికి గద్వాల నుంచి నాయకులు ఎవరూ తన ఇంటికి రావాల్సిన అవసరం లేదని... తన ఇంటి పక్కల కూడా ఎవరూ ఉండరాదని... ఇంట్లో భోజనం కూడా చేయరాదని... వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆయన అన్నారు. దీంతో, అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాదాపు మూడు గంటల సేపు అక్కడే ఉన్న అరుణ... ఆ తర్వాత చెల్లెలు సురేఖ వచ్చిన తర్వాత భోజనాలు చేయకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయారు.