: ఘోరకలి: కొండచరియలు విరిగిపడి 300 మంది సజీవ సమాధి.. 600 మంది మిస్సింగ్!
పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. రాజధాని ఫ్రీటౌన్‌లో కొండ చరియలు విరిగిపడి ఏకంగా 300 మంది సజీవ సమాధి అయ్యారు. మరో 600 మంది జాడ లేకుండా పోయింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రెడ్‌క్రాస్ తెలిపింది. భారీ వర్షాల వల్ల వరదలు ఉప్పొంగడంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. మట్టిపెళ్లల కింద, బురదలో చిక్కకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇప్పటి వరకు 297 మృతదేహాలను బయటకు తీశారు. వీరిలో 109 మంది పురుషులు కాగా 83 మంది మహిళలు, 105 మంది చిన్నారులు ఉన్నారు. కొందరి మృతదేహాలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. సియర్రా లియోన్ అధ్యక్షుడు ఎర్నెస్ట్ బై కొరోమా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బుధవారం నుంచి దేశంలో ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఘోర కలికి స్పందించిన ఐక్యరాజ్య సమితి అత్యవసర సహాయానికి ముందుకొచ్చింది.