: జాదవ్ కేసులో పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తున్న పాక్.. అడ్ హాక్ జడ్జి నామినేషన్ కోసం ప్రయత్నాలు!
పాక్ చెరలో ఉన్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో మరింత పట్టు బిగించేందుకు పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో వాదనలు జరుగుతున్న నేపథ్యంలో అడ్ హాక్ జడ్జి నామినేషన్ కోసం పాక్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. ఐసీజేలో పాక్ లీగల్ టీమ్ మరింత బలంగా తమ వాదనలు వినిపించడమే పాక్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది.
షరీఫ్ అధికారంలో ఉండగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఖలీలుర్ రెహమాన్ రామ్‌డేని ఇందుకోసం సంప్రదించినా ఆయన అందుకు అంగీకరించలేదు. ప్రస్తుతం సీనియర్ లాయర్ మఖ్దూమ్ అలీ ఖాన్, మాజీ చీఫ్ జస్టిస్ తస్సాదుఖ్ హుస్సేన్ జిలానీ, జోర్డాన్ మాజీ ప్రధాని అవన్ షాకత్ అల్-ఖసావ్‌నే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అయితే మఖ్దూమ్ అలీ ఖానే అడ్ హాక్ జడ్జిగా నామినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 10న పాక్ మిలటరీ కోర్టు జాదవ్‌కు ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష విధించింది. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు జాదవ్ మరణశిక్షపై ఐసీజే మే 18 వరకు స్టే విధించింది.