: ప్రారంభమైన సినీ కార్మికుల సమ్మె.. డిమాండ్ల సాధన కోసం రంగంలోకి 2.5 లక్షల మంది!


తమ డిమాండ్ల సాధన కోసం 2.5 లక్షల మంది బాలీవుడ్ సినీ కార్మికులు రంగంలోకి దిగారు. స్పాట్ బాయ్‌లు, జూనియర్ అసిస్టెంట్లు సహా అన్ని సెట్లలోని కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) ఆధ్వర్యంలో మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభమైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే సమ్మె చేపట్టినట్టు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీరేంద్ర నాథ్ తివారీ పేర్కొన్నారు.

కార్మికుల భద్రత, రోజుకు 8 గంటల పనివేళలతోపాటు వేతనాలు పెంచాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పేర్కొన్నారు. 2015లో ఇటువంటి డిమాండ్లపైనే గొంతెత్తితే అప్పుడు నిర్మాతలు కార్మికుల వేతనాలను 13 శాతం పెంచుతామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు అది అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే జీఎస్టీ కారణంగా తాము నష్టపోతున్నామని నిర్మాతలు అంటున్నారని బీరేంద్ర తెలిపారు.

 కార్మికులను వారు కట్టు బానిసల్లా చూస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం అయితే ఆరోపణలు టెలివిజన్ ప్రొడ్యూసర్స్‌పైనేనని, సినీ నిర్మాతలపై కాదని పేర్కొన్నారు. 90 రోజులుగా కార్మికులకు వేతనాలు అందక విలవిల్లాడిపోతున్నారన్నారు. తామెప్పుడూ ఇండస్ట్రీకి అండగానే ఉంటామని తెలిపారు. కాగా, కార్మికుల సమ్మె కారణంగా ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న షారూఖ్ ఖాన్ తదుపరి చిత్రం ‘పద్మావతి’, అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 9’పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News