: గువాం ద్వీప వాసులను బెంబేలెత్తించిన రేడియో ప్రకటన... ఉరుకులు పరుగులు పెట్టిన ప్రజలు!
ఇప్పటికే ఉత్తరకొరియా ప్రకటనతో ఎప్పుడు ఏ పక్క నుంచి ఏ క్షిపణి వచ్చిపడుతుందోనని ఆందోళన చెందుతున్న గువాం ద్వీపవాసులను రేడియో ప్రకటన ఉరుకులు పరుగులు పెట్టించింది. దాని వివరాల్లోకి వెళ్తే...గువాం ద్వీపంపై ఉత్తరకొరియా దాడి ప్రకటన చేసిన తరువాత అమెరికా పలు సందర్భాల్లో తానున్నానంటూ భరోసా ప్రకటనలు చేసింది. అయినప్పటికీ గువాం వాసుల్లో ఆందోళన పూర్తిగా పోలేదు.
ఈ నేపథ్యంలో నేటి ఉదయం 12.25 గంటలకు రెండు రేడియో స్టేషన్ల నుంచి "దాడులు పొంచి ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాల"ని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రజలంతా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే పోలీస్ స్టేషన్లకు ఫోన్ లు చేసి వివరాలడిగారు. దీంతో పొరపాటున అలాంటి ప్రకటన వెలువడిందని, మరోసారి ఇలాంటి తప్పు జరగదని భద్రతాధికారులు హామీ ఇచ్చేంతవరకు ఈ ఆందోళనలు కొనసాగాయి.