: ఆ కంపెనీ కొంప ముంచిన ఉడుత!
ఉడుత ఎవరికీ ఎలాంటి హాని చేయదన్న సంగతి తెలిసిందే. ఆహారం కోసం దొరికిన ప్రతిదానిని ఉడుత కొరుకుతుంటుంది. ఈ అలవాటు ఒక పెద్ద కంపెనీ కొంపముంచింది. దాని వివరాల్లోకి వెళ్తే.. బ్రిటిష్ కొలంబియాలోని బుర్నాబై నగరంలో స్కార్డిల్లో చీజ్ కంపెనీ అతిపెద్దది. ఇది జున్ను తయారు చేస్తుంది. ఆ కంపెనీలో వేలాది లీటర్ల పాలతో జున్నును తయారు చేస్తుంటారు. ఈ మధ్య ఓ ఉడత ఆ కంపెనీ సమీపంలో ఉన్న విద్యుత్ తీగను కొరికింది. దీంతో ఆ కంపెనీతో పాటు నగరానికి కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
జనరేటర్ వ్యవస్థ పనిచేయకపోవడంతో 12 గంటలు ఆ కంపెనీకి విద్యుత్ సరఫరా లేకుండాపోయింది. అప్పటికి కంపెనీలో 81 వేల లీటర్ల పాలు జున్ను తయారీకి సిద్ధంగా ఉన్నాయి. అయితే విద్యుత్ అంతరాయం వల్ల ఫ్రీజర్లు పని చేయకపోవడంతో అవి ఉండాల్సిన ఉష్ణోగ్రతలో లేకుండా పోయాయి. దీంతో ఆ పాలు జున్నుతయారీకి పనికిరాకుండా పోయాయి. దీంతో వారం రోజుల ఉత్పత్తి ఒక ఉడుత వల్ల నిలిచిపోయింది. దీంతో ఆ కంపెనీకి భారీ నష్టం వాటిల్లింది.