: జాతీయ జెండాకు అవమానం... తిరగేసి ఎగరేసిన టీడీపీ ఎమ్మెల్యే
71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ, తెలుగుదేశం పార్టీ పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, జాతీయ జెండాను తిరగేసి ఎగురవేశారు. ఈ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఎంతవరకూ ఉందన్న విషయం పక్కనపెడితే, ఆయన ఎగరేసిన జెండా గాల్లో తల్లకిందులుగా కనిపించడంతో అక్కడున్న వారంతా హతాశులయ్యారు.
ఈ ఉదయం గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎంపీపీ కార్యాలయంలో జరిగిన పతాకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జాతీయ పతాకం తిరగబడి ఉండటంపై, పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జెండాను ఎగురవేసిన తరువాత జరిగిన పొరపాటును గ్రహించిన ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది జెండాను సరిచేశారు. జెండా తలకిందులుగా అమర్చినందునే ఇలా జరిగిందని, కారకులైన వారిపై చర్య తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.