: ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ!
భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం, ఈ వేడుకలకు హాజరైన వారికి చేతులు ఊపుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తూ, ‘భారత ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి. అమరవీరుల స్ఫూర్తితో 2022 నాటికి నవభారత్ ను నిర్మించాలి. ప్రకృతి వైపరీత్యాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా వరదలతో అపారనష్టం వాటిల్లింది. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.
గోరఖ్ పూర్ లో చిన్నారుల మృతి చాలా బాధాకరం. కొన్ని సమస్యలు, ఆరోపణలు.. తుపాకులతో పరిష్కారం కావు. ప్రజలు మమేకమైనప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. భుజం భుజం కలిపి ముందుకు నడిచినప్పుడే శత్రువులకు సమాధానం చెబుతాం. దేశంలో వేగవంతమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నాం. 9 నెలల్లో శుక్రగ్రహానికి చేరినవాళ్లం.. 70 కిలోమీటర్ల రైల్వే లైన్ వేయడానికి 42 ఏళ్లు పట్టింది. ఇలాంటి పరిస్థితులు మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాలకు మరింత ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించి వేగవంతమైన అభివృద్దికి కృషి చేస్తున్నాం. అభివృద్ధి పథంలో ముందుకెళ్దామంటే ప్రజలెప్పుడూ వెనుకడుగు వేయరు. గ్యాస్ రాయితీ వదిలి వేయమన్నా, నోట్ల రద్దు చేసినా జనం అండగా నిలిచారు. జీఎస్టీ వంటి బృహత్తర కార్యక్రమానికి ప్రజలు వెన్నంటి నిలిచారు.
రైతుకు సాగునీరు అందిస్తే బంగారం పండిస్తారు. 'ప్రధాన మంత్రి కృషి యోజన' ద్వారా రైతుకు సాగునీరు అందించే కార్యక్రమం వేగవంతం చేస్తున్నాం. విత్తనాల నుంచి మార్కెట్ దాకా రైతుకు వెన్నదన్నుగా నిలిస్తేనే ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ వ్యవస్థలో లోపాలను సరి చేసేందుకు కొత్త విధానాలతో ముందుకొస్తున్నాం. జాతీయ వ్యవసాయ మార్కెట్ రూపలకల్పన అత్యంత ప్రధానమైంది. నష్టాల్లో ఉన్న రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించాలి. యువతకు ఆర్థిక సాయం చేస్తే ఉద్యోగం కోసం అడగరు. కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారు. దేశంలో ప్రతి పౌరుడు సంపూర్ణ హక్కులతో జీవించే అవకాశం ఉంది’ అన్నారు ప్రధాని.
అంతకుముందు, మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద మోదీ నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత జెండా ఆవిష్కరణ చేశారు. కాగా, ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్, దేవెగౌడ, విదేశీ అతిథులు తదితరులు పాల్గొన్నారు.