: సాంకేతికతను ఉపయోగించుకున్న హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు.. స్కైప్ ద్వారా విడాకుల కేసు విచారణ!
విడాకుల కేసు విషయంలో ఓ ఫ్యామిలీ కోర్టు వీడియో కాలింగ్ యాప్ స్కైప్ ద్వారా దంపతులను విచారించింది. హైదరాబాద్‌లోని ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో ఉంటున్న దంపతుల ఇద్దరి ఐడీలు, పాస్‌పోర్టులు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం స్కైప్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరయ్యేందుకు అనుమతించారు. తనకు పరీక్షలు ఉన్న కారణంగా ఇండియాకు రాలేనని భార్య, ఉద్యోగ రీత్యా ఇండియాకు వచ్చే పరిస్థితి లేదని భర్త చెప్పడంతో వారి అభ్యర్థన మేరకు వీడియో కాలింగ్ యాప్ ద్వారా హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది.
స్కైప్ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యే అవకాశాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చిలోనే కల్పించింది. హైదరాబాద్‌కు చెందిన ఓ విడాకుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇప్పుడు ప్రతీ జిల్లా కోర్టులోనూ వీడియో కాన్ఫరెన్స్ అవకాశం ఉందని, కాబట్టి దీనిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చని పేర్కొంది.