: ఎన్నికల బరిలోకి ప్రియాంక గాంధీ.. వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ?
దేశ రాజకీయాల్లోకి కాంగ్రెస్ నుంచి మరో ప్రజాకర్షక నేత వచ్చేస్తున్నారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాహుల్ గాంధీ కంటే ప్రియాంక అయితేనే బాగుంటుందని భావిస్తున్న సోనియా గాంధీ త్వరలోనే ఆమెకు పట్టం కట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోనియా అభిప్రాయానికి మన్మోహన్ సింగ్ సహా సీనియర్లు కూడా మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రియాంక పగ్గాలు చేపడితే రోజురోజుకు కుంగిపోతున్న పార్టీకి జవసత్వాలు వస్తాయని భావిస్తున్నారు.
నిజానికి పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌కు అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలని సోనియా భావించారు. అయితే రాహుల్ తన నాయకత్వంతో సీనియర్లను మెప్పించలేకపోయారు. ఆయన సారథ్యంలో ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో రాహుల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ప్రియాంకను నానమ్మ ఇందిర గాంధీ పోటీ చేసిన తెలంగాణలోని మెదక్ నుంచే బరిలోకి దింపాలని కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఎన్నికల్లో ప్రియాంక రాజకీయ అరంగేట్రం ఖాయమన్నమాటే!