: అయోధ్యకు దూరంగా మసీదు నెలకొల్పుతామన్న ప్రతిపాదనపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ
అయోధ్యలో ప్రార్థన మందిరాల నిర్మాణం అంశంపై ఇటీవలే ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీంకోర్టు ముందు ఓ ప్రతిపాదనను ఉంచిన విషయం తెలిసిందే. అయోధ్యకు దూరంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో మసీదు నిర్మించేందుకు సిద్ధమేనని షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు పేర్కొంది. ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అందుకు అభ్యంతరం తెలిపారు. మసీదు నిర్మాణం అనేది కేవలం ఏదో ఒక మతపెద్ద చెప్పాడన్న కారణంతో చేపట్టడం జరగదని అన్నారు.
షియా, సున్ని, బరెల్వి, సూఫీ, దియోబంది, సలఫై, బొహ్రి ఇలా ఎన్ని బోర్డులు ఉన్నా వాటి బాధ్యత నిర్వాహణే తప్ప ఆధిపత్యం చెలాయించటం కుదరదని పేర్కొన్నారు. అల్లాను, ఆయనిచ్చే తీర్పును నమ్మేవాళ్లు మాత్రమే మసీదును నిర్మిస్తారని అసదుద్దీన్ అన్నారు. వారంతా వారి రక్షణ కోసం అందులో నమాజ్‌లు నిర్వహిస్తారని తెలిపారు. అంతేకానీ, మసీదులపై పూర్తి హక్కు మాత్రం అల్లాది మాత్రమేనని తేల్చి చెప్పారు.