: ఆ పోలీస్ అధికారి 'పోకిరి'...అండర్ కవర్ లో 299 గ్యాంగ్ స్టర్ లను పట్టించాడు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'పోకిరి' సినిమా గుర్తుందా? అందులో ఐపీఎస్ అధికారి అయిన హీరో 'పోకిరి' వేషాలేసే వ్యక్తిగా, గ్యాంగ్ స్టర్ గా అండర్ కవర్ ఆపరేషన్ చేసి, గ్యాంగ్ స్టర్ లను అంతమొందిస్తాడు. అచ్చం అలాగే హాంగ్ కాంగ్ కు చెందిన ఓ పోలీసు అధికారి 11 నెలలపాటు అండర్ కవర్ లో వుండి, 299 మంది గ్యాంగ్ స్టర్ లను పట్టించాడు. హాంగ్ కాంగ్ లో గ్యాంగ్ స్టర్ ల ఆగడాలు మితిమీరిపోతుండడంతో పోలీసులు, ట్రైనింగ్ లో ఉండే అధికారులు కొత్తగా విధుల్లో చేరిన వారికి ఛాలెంజింగ్ విధులు అప్పగిస్తుంటారు. అందులో భాగంగా ఒక అధికారి అండర్ కవర్ ఆపరేషన్ కు తెరతీశారు. తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు 13 కేజీల బరువు తగ్గారు, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందర్నీ వదులుకున్నారు. చాలా కష్టపడి గ్యాంగ్ స్టర్ గా మారాడు. కేవలం 11 నెలల కాలంలో తానెవరు అన్నది తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటూ 299 మందిని పోలీసులకు పట్టించాడు.
గ్యాంగ్ స్టర్ గా మారిన మొదట్లో చాలామంది అతనిని నమ్మేవారు కాదు. దీంతో అతనికి కఠినమైన పరీక్షలు పెట్టేవారట. అలాగే అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఇన్ ఫెర్నల్ ఆఫైర్స్’ సినిమాలోని పాటలు పాడుతూ ఇతని ముఖకవళికలు గమనించేవారట. ఇలా ప్రతిక్షణం ప్రాణంతో చెలగాటమాడుతూ ఆయన 11 నెలల పాటు పని చేశారు. ఇంతవరకు హాంగ్ కాంగ్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన అండర్ కవర్ ఆపరేషన్ అదేనని అతని సహచరులు చెబుతున్నారు.
సాధారణంగా అండర్ కవర్ అపరేషన్ అంటే 6 నెలలకు మించి జరగదని, అయితే అతని విషయంలో 11 నెలల కొనసాగింపుకు అవకాశమిచ్చారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నాడని, ఆయన భద్రత నేపథ్యంలో అతనికి గవర్నమెంట్ తుపాకీ అందజేసిందని వారు చెబుతున్నారు. సెలవు పూర్తి చేసుకుని రాగానే అతనికి పదోన్నతి ఉంటుందని వారు చెబుతున్నారు.