: బాలీవుడ్ భామ నేహా ధూపియాకు యాక్సిడెంట్.. సహాయం చేయడం మానేసి, సెల్ఫీలకు ఎగబడ్డ జనం!
బాలీవుడ్ భామ నేహాధూపియా యాక్సిడెంట్ కు గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు చండీగఢ్ లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలు కాకపోయినా, ఆమె కళ్లద్దాలు పగిలిపోయాయి. రోడ్డు మధ్యన ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో, రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కారులో ఉన్నవారికి సాయం చేయడానికి వెళ్లినవారు... అందులో ఉన్న నేహాధూపియాను గుర్తు పట్టారు.
అంతే... అక్కడున్న జనాలంతా ఆమె పరిస్థితిని పట్టించుకోకుండా, ఆమెతో సెల్ఫీలకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో, ఆమె చాలా ఇబ్బందికి గురయింది. ఓ అరగంట సేపు వారికి సెల్పీలతో పాటు, ఆటోగ్రాఫ్ లు ఇవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత వేరే కారు రావడంతో... బతుకుజీవుడా అంటూ ఆమె ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయింది. చండీగఢ్ లో ఓ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకులు పని చేయకపోవడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని ఆమె పీఆర్వో తెలిపాడు. కాగా, గతంలో బాలయ్య సరసన 'పరమవీరచక్ర' సినిమాలో కూడా నేహా ధూపియా నటించింది.