: చిన్నారుల దుర్మరణం నేపథ్యంలో.. యోగి ఆదిత్యనాథ్ అత్యవసర సమావేశం!
యూపీలోని గోరఖ్ పూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ లేని కారణంగా కేవలం ఒక్క రోజులోనే 30 మంది పిల్లలు దుర్మరణం పాలవడం దేశ ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. మన దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఎలా ఉందో ఈ ఉదంతం మరోసారి గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.
ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్, మెడికల్ విద్య మంత్రి అశుతోష్ టాండన్ లతో ఆయన సమావేశమయ్యారు. ఇద్దరూ వెంటనే గోరఖ్ పూర్ ఆసుపత్రికి వెళ్లి, పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. మరోవైపు, ఇటీవలే ఆయన ఈ ఆసుపత్రిని సందర్శించి, రోగుల సమస్యల గురించి తెలుసుకున్నారు. అయన సందర్శన తర్వాత రెండు రోజులకే ఈ ఘటన జరగడంతో యోగి సీరియస్ అయ్యారు.