: మన యుద్ధ ట్యాంకులు ఇంతేనా? సత్తా చూపలేక విఫలమై అర్థంతరంగా వెనక్కు!
రష్యాలోని మాస్కో రీజియన్ లోని అల్బీనో రేంజ్ లో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ట్యాంక్ బైత్లాన్ నుంచి భారత్ అర్థంతరంగా నిష్క్రమించింది. పలు దేశాల నుంచి వచ్చిన ట్యాంకులు తమ సత్తాను ఇక్కడ ప్రదర్శిస్తుండగా, ఇండియా నుంచి టీ-90 యుద్ధ ట్యాంకులు వెళ్లాయి. రెండు ట్యాంకులను భారత్ పంపగా, రెండింటిలోనూ సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో రేసును పూర్తి చేయలేకపోవడంతో, విన్యాసాల నిర్వహణా అధికారులు ఇండియాను డిస్ క్వాలిఫై చేశారు. దీంతో ఆర్మీ ట్యాంకుల సిబ్బంది తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తొలి రౌండ్ పోటీల్లో బలమైన ప్రత్యర్థిగా నిలిచిన భారత్ ఆపై మాత్రం స్థాయికి తగ్గ ప్రతిభను కనబరచలేక పోయింది.
ఇక ఇండియా నిష్క్రమించిన తరువాత రష్యాతో పాటు బెలారుస్, కజకిస్థాన్, చైనా ట్యాంకులు తుది రౌండుకు చేరుకున్నాయి. చైనా దేశీయంగా అభివృద్ధి చేసుకున్న టైప్ 96బీ ట్యాంకులతో పోటీ పడుతుండగా, రష్యా కజకిస్థాన్ లు టీ-72బీ3 ట్యాంకులతో, బెలారుస్ టీ-72 రకం ట్యాంకులతో రంగంలో ఉన్నాయి. మొత్తం 19 దేశాల నుంచి వచ్చిన ట్యాంక్ టీములు పోటీపడగా, తుది వరకూ ఇండియా నిలవలేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. సెమీఫైనల్ దశలోనే భారత్ వెనుదిరగడంతో ట్యాంకుల సత్తాపై అనుమానాలు పెరుగుతున్నాయి.