: సైనా నెహ్వాల్ బయోపిక్‌లో శ్రద్ధా కపూర్.. ఆమే తన ఫస్ట్ చాయిస్ అన్న అమోల్ గప్తే
హైదరాబాద్‌కు చెందిన ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత్ర చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటి శ్రద్ధా కపూర్ నటించనుంది. భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘హసీనా: క్వీన్ ఆఫ్ ముంబై’లో హసీనాగా లీడ్ రోల్ పోషించిన శ్రద్ధ ఇప్పుడు రెండో బయోపిక్ కోసం సిద్ధమవుతోంది.
‘సైనా’ పేరుతో తెరకెక్కించనున్న ఈ సినిమాలో శ్రద్ధాకే తన తొలి ప్రాధాన్యమని దర్శకుడు అమోల్ గప్తే పేర్కొన్నారు. శ్రద్ధ అచ్చం సైనాలానే ఉంటుందని, తన తొలి ప్రాధాన్యం ఆమెకేనని స్పష్టం చేశారు. బయోపిక్ విషయంలో సైనాతోనూ మాట్లాడినట్టు ఆయన తెలిపారు. సైనా బయోపిక్ తీయాలన్నది ఇప్పటి ఆలోచన కాదని, గత రెండేళ్లుగా ఈ స్క్రిప్ట్‌పై పనిచేస్తున్నట్టు అమోల్ పేర్కొన్నారు. బయోపిక్ కోసం శ్రద్ధ ఏస్ బ్యాడ్మింటన్ ప్లేయర్ జితేజ్ పదుకొనే వద్ద శిక్షణ కూడా పొందుతోందన్నారు.