: జగన్‌ను తక్షణం జైల్లో పెడితే ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది: కాల్వ శ్రీనివాసులు
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తోన్న వ్యాఖ్యల పట్ల ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తోన్న జగన్‌ను తక్షణం జైల్లో పెడితే ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ విజయం తథ్యమని చెప్పారు.
రాయలసీమకు సంబంధించి నలుగురు మంత్రులు నంద్యాలలో ప్రచారంలో పాల్గొంటున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. వైసీపీ నాయకులు దాదాపు 120 మంది నంద్యాలలోనే 20 రోజులుగా ఉంటున్నారని, వారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. జగన్ మీడియాలో వస్తోన్న వార్తలు అభ్యంతరకరమని అన్నారు. నంద్యాలలో ఓడిపోతారన్న భయంతోనే జగన్ మానసిక పరిస్థితిని ఇలా తయారయిందని ఎద్దేవా చేశారు.