: తాజ్ మహల్ సమాధా? శివాలయమా?: కేంద్రాన్ని ప్రశ్నించిన సీఐసీ
ఆగ్రాలోని తాజ్‌మహల్ షాజహాన్ నిర్మించిన సమాధా? లేక రాజ్‌పూత్ రాజు ఆయనకు బహుమతిగా ఇచ్చిన శివాలయమా? అనే విషయంపై స్పష్టతనివ్వాలని కేంద్ర సమాచార కమిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖను కోరింది. సమాచార హక్కు చట్టం కింద కొంత మంది చరిత్రకారులు తమను ఈ విషయాన్ని అడుగుతున్నట్లు సీఐసీ తెలిపింది. అనధికారిక ప్రపంచ వింతల్లో ఒకటిగా చెబుతున్న తాజ్‌మహల్ చరిత్రకు సంబంధించి ఉన్న అనుమానాలను, వివాదాస్పదం కాకముందే తీర్చాలని సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. అలాగే తాజ్‌మహల్ చరిత్రపై ఉన్న కేసుల్లోనూ సమాధానం చెప్పేలా పూర్తి స్పష్టతను ఇవ్వాలని సాంస్కృతిక శాఖను శ్రీధర్ ఆదేశించారు.
తాజ్‌మహల్‌ను షాజహాన్ నిర్మించలేదని, అది తేజో మహాలయం అని పిలిచే శివుని గుడి అని, దాన్ని రాజా మాన్ సింగ్, షాజహాన్‌కు బహుమతిగా ఇచ్చారన్న ప్రచారం వుందని, ఇందులో ఎంత నిజముందో సాక్ష్యాలతో సహా తెలియజేయాలని బీకేఎస్ఆర్ అయ్యంగార్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశాడు. దీనికి సమాధానంగా చరిత్రకు సంబంధించి నిజానిజాలు కనిపెట్టే విషయం ఆర్టీఐ పరిధిలోకి రాదని శ్రీధర్ వెల్లడించారు. గతంలో తనను తాను చరిత్రకారునిగా చెప్పుకునే ఓక్ అనే వ్యక్తి కూడా `తాజ్ మహల్: ద ట్రూ స్టోరీ` అనే పుస్తకం రాసి అందులో తాజ్ మహల్ శివాలయమని రచించినట్లు, ఈ విషయంపై తాజ్ మహల్‌ను శివాలయంగా గుర్తించాలంటూ 2000 సం.లో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయాన్ని సమాచార కమిషనర్ గుర్తుచేశారు.