: ఘరానా మోసం బట్టబయలు... నిర్మాత షేక్ బషీద్ అరెస్టు!


నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలు పొందిన సినీ నిర్మాత షేక్ బషీద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాల్లోకి వెళ్తే గుంటూరుకు చెందిన షేక్ బషీద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 26లో ప్లాట్‌ నెంబర్ 304లో నివాసం ఉంటున్నాడు. సినిమాలపై మోజుతో విద్యాభ్యాసం మధ్యలోనే హైదరాబాదు చేరిన ఇతను వివిధ సినీ విభాగాల్లో శిక్షణ పొందాడు. 'అల్లరే అల్లరి', 'మెంటల్‌ పోలీస్‌', 'నోటుకు పోటు' వంటి సినిమాలతో పాటు, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఫిల్మ్ నగర్‌ లో పేరు సంపాదించుకున్నాడు.

ఇక ఇతను సినిమాలు ఎలా నిర్మించాడంటే... ఖరీదైన ప్రాంతాల్లో ఇతరుల పేరిట ఉన్న విలువైన ఆస్తులకు నకిలీ పత్రాలు తయారు చేసి, నకిలీ కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి మార్ట్ గేజ్ లోన్లు పొందాడు. విమల్‌ గోయల్‌ అనే వ్యక్తితో కలిసి జి.ఎం.జ్యుయలర్స్ ను ప్రారంభించానని చెబుతూ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా హిమాయత్‌ నగర్‌ శాఖ నుంచి 2 కోట్ల రూపాయల రుణం పొందాడు.

 ఈ రుణానికి ష్యూరిటీగా బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 7లో ఉన్న విలువైన భూమిని తనఖా పెట్టాడు. ఆ భూమి హైమావతి అనే మహిళకు చెందినదని బ్యాంకు అధికారులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతను పలు కేసుల్లో నిందితుడని గుర్తించారు. అతనిపై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

ఇక ఇతను తీసుకున్న లోన్ల వివరాలు. జూబ్లీహిల్స్‌ సిండికేట్‌ బ్యాంకులో షేక్‌ పేట్‌ ప్రాంతంలోని ఎవరిదో ఒక ఇంటిని గ్యారంటీగా ఉంచి బజ్జు ఎర్త్‌ మూవర్స్‌ పేరిట 65 లక్షల రూపాయలు తన ఖాతాలో జమచేయించుకున్నాడు. హెచ్‌ఎస్బీసీలో 70 లక్షలు రుణం పొందాడు. అలాగే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో 70 లక్షల రూపాయలు, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకులో 35 లక్షల రూపాయలు రుణాలు పొందాడు. ఈ లోన్లు పొందేందుకు ష్యూరిటీగా పెట్టిన భూములన్నీ అతనివి కాదని తేలింది. దీంతో గోయల్, బషీద్ లను అరెస్టు చేసిన పోలీసులు, రిమాండ్ కు తరలించారు. బషీద్ పై గతంలో ఏపీ, కర్ణాటక, హైదరాబాద్‌ లోని పలు పోలీస్‌ స్టేషన్స్‌ లో పాత కేసులున్నాయని, మరో రెండు కేసుల్లో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్స్‌ కూడా పెండింగ్‌ లో వున్నాయని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News