: వెంకయ్యనాయుడుతో నాది 40 ఏళ్ల సహజీవనం... ఆయన సమయస్ఫూర్తికి ఇదో ఉదాహరణ!: సీతారాం ఏచూరి


ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో 40 ఏళ్ల సహజీవనం తనదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. రాజ్యసభలో ఛైర్మన్ హోదాలో కూర్చున్న వెంకయ్యనాయుడును ఉద్దేశించి మాట్లాడేందుకు లేచిన సందర్భంలో ఇంగ్లీష్ లో మాటలు ప్రారంభించగా...తెలుగులో మాట్లాడండి అని వెంకయ్యనాయుడు అనగానే నవ్వేసి...ఆప్షన్ ఉందా? అని అడిగారు. తరువాత కొనసాగిస్తూ, 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సిద్ధాంత పరంగా పోరాడాం, విభేదించాం, కలిసి పనిచేశాం, అనుభవాలు, అభిప్రాయాలు, ఆప్యాయతలు పంచుకున్నామని అన్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తమ ఇద్దరినీ చూసి మీడియా ఒకసారి, సభలో అంత తీవ్రంగా వ్యతిరేకిస్తారు కదా... బయట ఇలా ఎలా ఉండగలుగుతున్నారని అడిగిందని గుర్తు చేసుకున్నారు.

 అప్పుడు వెంకయ్యనాయుడు వారికి సమాధానమిస్తూ, 'నేను ఒక రైలు ఎక్కాను. రైలులో ప్రవేశించిన తరువాత సీతారాం ఏచూరి కనిపించాడు. వెంటనే రైలు దిగెయ్యాలా? అని ఎదురు ప్రశ్నించారు' అనగానే... సభలోని వారంతా నవ్వేశారు. తమ సిద్ధాంతాలు, దారులు వేరైనా పని చేసింది మాత్రం ఒకే లక్ష్యం కోసం, ఒకే చోట అని ఆయన అన్నారు. వెంకయ్యనాయుడుకి ఈ సందర్భంగా తాను గురజాడ మాటలు గుర్తు చేస్తున్నానని ఆయన చెప్పారు. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నది ప్రతిక్షణం గుర్తుంచుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే ప్రధానమైన స్థానంలో వెంకయ్యనాయుడు కూర్చుని ఉన్నారని, ఆయన నిష్పాక్షికమైన బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News