: ఉద్యోగం మారగానే... పీఎఫ్ అకౌంట్ బదిలీ ఇక మరింత సులభతరం!
వచ్చే నెల నుంచి ఉద్యోగం మారిన వెంటనే పీఎఫ్ అకౌంట్ కూడా ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యే సౌలభ్యాన్ని ఈపీఎఫ్ఓ కల్పించనుంది. ఈ మేరకు చీఫ్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వీపీ జాయ్ స్పష్టం చేశారు. ఈపీఎఫ్ఓను ఉద్యోగికి అనుకూలంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. `చాలామంది ఉద్యోగం మారిన వెంటనే పాత పీఎఫ్ అకౌంటును అర్థంతరంగా మూసివేసి, కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పాత అకౌంట్‌లో ఉన్న మెచ్యూర్డ్ అమౌంట్ వృథా అవుతోంది` అని జాయ్ అన్నారు.
పాత అకౌంట్‌ను కొత్త ఉద్యోగానికి బదిలీ చేసుకునే అవకాశం ఉన్నా ధ్రువీకరణ పత్రాలు, పరిశీలన వంటి విధానాలు ఉండటం వల్ల చాలా మంది ఉద్యోగులు బదిలీ చేసుకునేందుకు మొగ్గు చూపడం లేదని ఆయన వివరించారు. ప్రస్తుతం పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ తప్పనిసరి చేయడం వల్ల ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే ఉద్యోగం మారగానే మూడు రోజుల్లో పీఎఫ్ అకౌంట్ కూడా ఆటోమేటిక్‌గా బదిలీ అయ్యేలా చేసేందుకు అవకాశం ఉందని జాయ్ పేర్కొన్నారు. దీంతో పాటు త్వరలో మరిన్ని సేవలను ప్రవేశపెడతామని జాయ్ చెప్పారు.