: ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకుంది... అన్యాయంగా చంపేశారు!
బాలికలపై వేధింపులు ఉత్తర ప్రదేశ్ మారుమూల గ్రామాల్లో రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఎన్నో కలలు కన్న ఓ పదిహేడేళ్ల బాలికను, ఐదుగురు యువకులు కలిసి వెంటాడి వేధించి, చివరికి చంపేశారు. ప్రధాన నిందితుడు తమ గ్రామ పెద్ద కుమారుడు కావడం వల్ల పేద వాళ్లైన బాలిక కుటుంబీకులు ఏం చేయలేకపోతున్నారు. పైగా బాలిక హత్యకేసును ప్రేమ విఫలం కేసుగా పోలీసులు మార్చడంతో ఆ తల్లిదండ్రులు మరింత కుమిలిపోతున్నారు.
ఉత్తర ప్రదేశ్‌లోని బాలియా ప్రాంతంలో బజాహ ఊరిలో రాగిణి నివసించేది. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న రాగిణికి ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండేది. అందుకోసం పదవ తరగతి నుంచే ఇంగ్లిషు మీద పట్టుసాధించడానికి ప్రయత్నించేదని రాగిణి చెల్లి నేహ తెలిపింది. కొంతకాలంగా గ్రామపెద్ద కుమారుడు ప్రిన్స్ తివారీ తన స్నేహితులతో కలిసి అక్కను వేధించేవాడని, తర్వాత కొన్ని రోజులు ఊరి చివర కొండల్లో తన అక్క శవమై కనిపించిందని నేహ వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఊరి పెద్ద కృపా శంకర్ తివారీ మాటలు విని, అక్క మృతికి ప్రేమ రంగు పులిమారని నేహ బాధపడింది. తమకు జరిగిన అన్యాయానికి తమ తల్లిదండ్రులు తీవ్రంగా మానసిక వేదన అనుభవిస్తున్నారని చెప్పింది.