: సిట్ చేతికి సినీ ప్రముఖుల ఫోరెన్సిక్ ఫలితాలు... ఇద్దరు కన్ ఫర్మ్!


టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ వ్యవహారంలో సినీ ప్రముఖుల రక్త నమూనాలు, తల వెంట్రుకలు, గోర్లపై ఫోరెన్సిక్ నివేదిక సిట్ అధికారుల చేతికి అందింది. ఈ కేసు డైరీని ఒ కొలిక్కి తీసుకువచ్చిన సిట్, రెండు రోజుల్లో చార్జ్ షీట్ ను పూర్తి చేయనుంది. ఇందుకు అవసరమైన 95 శాతం కసరత్తు పూర్తయినట్టు సిట్ వర్గాల సమాచారం. ఇక ఇప్పటివరకూ 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు, సినీ ప్రముఖులను మాత్రం విచారణకే పరిమితం చేశారు. విచారించిన సినీ ప్రముఖుల్లో ఒకరిని డ్రగ్స్ సరఫరా దారుల జాబితాలో సిట్ చేర్చింది. ఓ హీరో గుడ్ విల్ కింద మరికొందరికి డ్రగ్స్ ఇచ్చినట్టు, వీరిద్దరూ స్వయంగా డ్రగ్స్ వాడినట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో వెల్లడైనట్టు తెలుస్తోంది.

 ఇక తన బాస్ సూచన మేరకు బ్యాంకాక్ వెళ్లి రెండు సార్లు డ్రగ్స్ తెచ్చిన ఓ సినీ ప్రముఖుడిని ప్రధాన సాక్షిగా చేర్చనున్నట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. ఇక విచారణ ఎదుర్కొన్న మరో నటుడు శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరించగా, గతంలో ఆయన డ్రగ్స్ వాడినట్టు తెలుస్తున్నా, ప్రస్తుత కేసులో ఎటువంటి సాక్ష్యాలూ లేవని సిట్ అధికారులు వెల్లడించారు. అయితే, ఆయన స్టేట్ మెంట్ ఆధారంగా మరో ప్రముఖుడిపై పక్కాగా కేసు పెట్టవచ్చని భావిస్తున్నట్టు సమాచారం. విచారణ అనంతరం సినీ ప్రముఖులు చెప్పిన విషయాలను క్రోఢీకరించిన తరువాత కేసులో స్పష్టత పెరిగిందని, అధికారుల నుంచి అనుమతి రాగానే చార్జ్ షీట్ వేస్తామని సిట్ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News