: భారతీయులతో నిండిపోతున్న విదేశీ జైళ్లు.. సౌదీలోనే అత్యధికం!
భారతీయులతో విదేశీ జైళ్లు నిండిపోతున్నాయి. దాదాపు 7,620 మంది భారతీయులు విదేశీ జైళ్లలో మగ్గిపోతున్నారు. వీరిలో అత్యధికులు సౌదీ అరేబియా జైళ్లలో శిక్షలు అనుభవిస్తున్నారు. బుధవారం లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎంజే అక్బర్ సమాధానమిస్తూ ఈ వివరాలు వెల్లడించారు. అయితే గోప్యతా విధానాల కారణంగా ఖైదీల వివరాలను ఆయా దేశాలు వెల్లడించడం లేదని పేర్కొన్నారు. ఖైదీలకు సంబంధించిన వ్యక్తులు ఆ విషయాన్ని వెల్లడిస్తే తప్ప విషయం బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ వద్ద ఉన్న గణాంకాల ప్రకారం మొత్తం 86 జైళ్లలో 7,620 మంది భారతీయులు జైలు శిక్ష అనుభవిస్తున్నారని, వీరిలో 50 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. మహిళల్లో అత్యధికులు ఆగ్నేయ ఆసియా దేశాలైన శ్రీలంక, చైనా, నేపాల్, గల్ఫ్, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని జైళ్లలో ఉన్నట్టు వివరించారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల్లో 56 శాతం మంది గల్ఫ్ దేశాల్లోని జైళ్లలో ఉన్నట్టు వివరించారు. ఆర్థిక నేరాలు, దోపిడీ, లంచం కేసుల్లో వీరు శిక్ష అనుభవిస్తున్నట్టు చెప్పారు. వీరిలో కొందరు మద్యం తాగడం, విక్రయించడం తదితర నేరాలతో అరెస్టయ్యారన్నారు. సౌదీ అరేబియాలో అది చట్టవిరుద్ధమని మంత్రి వివరించారు.
అలాగే థాయిలాండ్, మలేసియా, సింగపూర్, ఇండోనేషియాలో 500 మంది శిక్షలు అనుభవిస్తున్నట్టు తెలిపారు. పాకిస్థాన్ జైళ్లలో 500 మంది జాలర్లు సహా 546 మంది ఉన్నట్టు పేర్కొన్నారు. ఆస్ట్రేలియా, కెనడా దేశాల్లో 115 మంది శిక్షలు అనుభవిస్తున్నట్టు మంత్రి సభకు తెలిపారు. 30 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నామని, త్వరలో ఆయా దేశాల జైళ్లలో ఉన్న భారతీయులను వెనక్కి రప్పిస్తామని మంత్రి అక్బర్ హామీ ఇచ్చారు.