: లవ్ ఫెయిల్యూర్: విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్ లో వైజాగ్ యువతి ఆత్మహత్యాయత్నం!
కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో వైజాగ్ కు చెందిన యువతి (23) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... విజయవాడలోని కృష్ణలంక నెహ్రూనగర్‌కు చెందిన పోస్టల్ ఉద్యోగి కుమారుడు (25) సీఏ చదువుతున్నాడు. అతనికి ఫేస్ బుక్ లో వైజాగ్ కు చెందిన బీటెక్ చదువుతున్న యువతి పరిచయమైంది. ఈ ఫేస్ బుక్ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు.
దీంతో యువతి తన తల్లిదండ్రులతో కలిసి మూడు నెలల క్రితం విజయవాడలోని కానూరుకు మకాం మార్చింది. అక్కడి నుంచి సింగ్ నగర్ కు మారింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో యువకుడు తనను మోసం చేశాడంటూ యువతి పెనమలూరు పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో సాయంత్రం మళ్లీ పోలీస్ స్టేషన్ కు స్కూటీపై వచ్చిన యువతి, బాత్రూమ్ శుభ్రంచేసే యాసిడ్ తాగేసి ఆత్మహత్యాయత్నం చేసింది. వాంతులు చేసుకుని పడిపోయిన ఆమెను పోలీసులు గమనించి హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.