: పవన్ కల్యాణ్, రజనీకాంత్ కలిసి పోటీ చేస్తారు...తమిళనాట ఆసక్తికర చర్చ!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి తమిళ నాట అనేక ఆసక్తికర చర్చలు నడుస్తున్న నేపథ్యంలో తాజాగా మరొక చర్చ అందర్నీ ఆకట్టుకుంటోంది. రజనీకాంత్ ఏపీలోని జనసేనతో పొత్తు పెట్టుకుంటారని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. తమిళనాడులో రజనీకాంత్ అడిగితే ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే తెలుగులో పవన్ కల్యాణ్ కు కూడా ప్రాణమిచ్చే అభిమానులున్నారు. ఈ ఇద్దరూ నిరాడంబరంగా ఉంటారని, సినిమాలతో సంపాదించిన క్రేజ్ కంటే వ్యక్తిగత జీవితంతో సంపాదించిన క్రేజే ఎక్కువని, వీరిద్దరూ కలిసి తెలుగు, తమిళ రాష్ట్రాలను శాసిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
అదీ కాక తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ప్రభావం చూపుతారని, అలాగే ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో తమిళ ప్రజలు ప్రభావం చూపుతారని, ఈ నేపథ్యంలో వీరిద్దరికీ మంచి ఫాలోయింగ్ రెండు రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో వీరిద్దరూ జట్టు కడితే ఉపయోగం ఉంటుందని వారి అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశ ప్రకటన చేసిన వెంటనే వీరి పొత్తు ప్రారంభమవుతుందని కోలీవుడ్ లో కొందరు చెబుతున్నారు. తెలుగులో జనసేన, తమిళంలో మక్కల్ సేన (జనసేనే) కలిస్తే విజయం ఈ రెండు పార్టీల సొంతమని వారు జోస్యం చెబుతున్నారు.