: వీరు మంచి దొంగలు... క్షమించమని వేడుకుంటూ బైక్ తిరిగి ఇచ్చేశారు!
'దొంగలందు మంచి దొంగలు వేరయా..' అని బ్రిటన్ దొంగలను చూసి అనుకోవాలి. ఆ వివరాల్లోకి వెళ్తే... రెండు వారాల కిందట ఫేస్ బుక్ లో మెల్ ఫిషర్ అనే మహిళ తన ప్రియుడి కుమారుడి బైక్ ను ఎవరో ఎత్తుకెళ్లిపోయారని, దయచేసి ఆ బైక్ కనిపిస్తే వివరాలు తెలియజేయాలని కోరుతూ ఆమె ఓ లేఖను ఉంచారు. ఆమె ఫేస్ బుక్ లో ఆ పోస్టు ఉంచిన ఓ వారానికి ఆ బైక్ ఆ పిల్లాడి ఇంటి ముందు కనిపించింది. దానితో పాటే ఒక లెటర్ కూడా దర్శనమిచ్చింది.
అందులో 'మీ కుమారుడి బైక్ దొంగిలించినందుకు ముందుగా క్షమాపణలు చెబుతున్నాం. వాస్తవానికి మేం చేసిన తప్పు క్షమార్హం కానప్పటికీ వివరణ ఇచ్చుకుంటున్నాం. మేం ఎవరో టీనేజర్ దని భావించి ఈ బైక్ ని ఎత్తుకెళ్లాం. అయితే, మీ ఫేస్ బుక్ లో పోస్ట్ చూశాక వెంటనే మీ బైక్ తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకే మీ పిల్లాడి బైక్ ను ఇకపై ఎవరూ దొంగిలించలేనంత బలమైన తాళాన్ని కొనుగోలు చేశాం. తాళాలు బైక్ కి పెట్టాము. మీరు సూచించిన చోటే బైక్ ఇవ్వలేకపోతున్నాం. మన్నించండి. ఈ బైక్ చూశాక.. మీ పిల్లాడు సంతోషిస్తాడని భావిస్తున్నాం. ఈ బైక్ ను నడిపే యోగ్యత అతడికే ఉంది' అంటూ పేర్కొన్నారు. దీంతో మెల్ ఫిషర్, ఆమె ప్రియుడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.