: భారత్ మాతాకి జై అనని విలేకరులు... వారిని పాకిస్థానీయులతో పోల్చిన బీహార్ మంత్రి!
బీహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ (బీజేపీ) తమ పార్టీ సమావేశంలో పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో తన ప్రసంగం ముగింపు సమయంలో భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సదరు మంత్రి.. అందరూ ఆ నినాదం చేయాలని సూచించారు. అయితే, అక్కడి కొందరు విలేకరులు ఆ నినాదం చేయకుండా తమ పని తాము చూసుకున్నారు. దీంతో ఆయన వారిని పాకిస్థానీలు, పాక్ సానుభూతిపరులు అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది.
భారత్ మాతాకి జై అని నినదించని వారిని తన చేతితో చూపిస్తూ వారిపై ఈ వ్యాఖ్యలు చేశారు. విలేకరులు కాక ముందే మీరంతా భరతమాత ముద్దుబిడ్డలని ఆయన వారితో అన్నారు. ఆ తరువాతే మీడియా మిత్రులు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. దీనిపై వివాదం చెలరేగడంతో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. తాను ప్రసంగిస్తుండగా తీసిన వీడియోను ఓ సారి చూడాలని చెప్పారు.