: ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 30 నగరాల్లో టాప్ 5లో నాలుగు భారత్‌వే!
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ వారు చేపట్టిన ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 30 నగరాల అధ్యయనంలో భారత్ కు చెందిన నాలుగు నగరాలు టాప్ 5లో చోటు సంపాదించుకున్నాయి. వీటిలో ఢిల్లీ నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, 2021 నాటికి ఢిల్లీ ఆర్థిక పరిస్థితి ఇప్పటితో పోల్చితే 50 శాతం వరకు మెరుగ్గా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఆర్థికంగా, వ్యాపార పరంగా కొనసాగుతున్న ఎదుగుదలే భారతదేశ నగరాల అభివృద్ధికి ప్రధాన కారణమని అధ్యయనం పేర్కొంది.
అలాగే ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న స్టార్ బక్స్, మెక్‌డొనాల్డ్స్ వంటి పెద్ద కంపెనీలు భారత్, చైనా వంటి అధిక జనాభా గల దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం కూడా ఆయా నగరాల అభివృద్ధికి పరోక్షంగా కారణమవుతుందని ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ తెలియజేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఢిల్లీ ఉండగా, చైనా నగరం హో చి మిన్ రెండవ స్థానంలో, చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. జపాన్‌లోని ఒసాకా నగరం చివరి స్థానంలో నిలిచింది.