: 'మోత్కుపల్లి కాబోయే గవర్నర్' అంటూ కీలక వ్యాఖ్యలు చేసి అభినందనలు తెలిపిన వెంకయ్య నాయుడు
తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులును రెండు రోజుల్లో భారత ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్న ముప్పవరపు వెంకయ్యనాయుడు 'కాబోయే గవర్నర్' అంటూ సంబోధించారు. ఈ ఉదయం తనను కలిసిన టీటీడీపీ నేతలతో సమావేశమైన ఆయన, మోత్కుపల్లి నియామకంపై అతి త్వరలోనే శుభవార్త వింటారని వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ సందర్భంగా మోత్కుపల్లికి వెంకయ్య అభినందనలు కూడా తెలిపారు. కాగా, చాలాకాలంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మోత్కుపల్లిని గవర్నర్ పదవి వరిస్తుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నేడు వెంకయ్య నోటి వెంట కూడా అవే మాటలు రావడంతో మోత్కుపల్లి అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. ఆయన నియామకంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా, మిగతా టీడీపీ నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు.