: చైనా బలగాలను ఎదుర్కోవాలంటే మరో రూ. 20వేల కోట్లు కావాలి: కేంద్రానికి రక్షణ శాఖ వినతి
భారత్ - చైనాల మధ్య వివాదాస్పదంగా మారిన డోక్లాం సరిహద్దు ప్రాంతంలో మోహరించిన చైనా బలగాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మరో రూ. 20వేల కోట్ల రూపాయలు కావాలని రక్షణ మంత్రిత్వ శాఖ కేంద్రాన్ని కోరింది. భద్రతా బలగాలను ఆధునికీకరించడంతో పాటు వారికి రోజువారీ సౌకర్యాలు కల్పించడానికి అదనపు నిధులు అవసరమని రక్షణ శాఖ వివరించింది.
ఈ విషయమై రక్షణ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా, ఆర్థిక కార్యదర్శితో సమావేశమైనట్లు తెలుస్తోంది. 2017-18 బడ్జెట్‌లో కేంద్రం రక్షణ శాఖకు రూ. 2.74 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో రూ. 1,72,774 కోట్లు సైనికుల రోజువారీ ఖర్చులు, జీతాల కోసం కేటాయించగా, రూ. 86,488 కోట్లను ఆయుధాల ఆధునికీకరణ కోసం కేటాయించింది. గత నెలన్నర రోజులుగా సాగుతున్న డోక్లాం వివాదం కారణంగా బడ్జెట్ నిధులు తగ్గిపోవడం వల్ల అదనపు నిధి కోసం రక్షణ శాఖ ప్రయత్నిస్తోంది.