: అమెరికాకు చెందిన ద్వీపంపై అణుబాంబు వేయనున్నాం!: ఉత్తర కొరియా ప్రకటన
అమెరికాకు చెందిన ఓ ద్వీపంపై అణుబాంబు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించి సంచలనం రేపింది. పసిఫిక్ మహా సముద్రంలోని అమెరికా అధీనంలో ఉన్న గువాం ద్వీపం తమకు 2,128 మైళ్ల దూరంలో ఉందని, ఆ ద్వీపాన్ని సర్వ నాశనం చేసి చూపిస్తామని ఉత్తర కొరియా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ ఐలాండ్ తీరంలో యూఎస్ కు చెందిన సబ్ మెరైన్ల స్క్వాడ్రన్, ఒక ఎయిర్ బేస్, కోస్ట్ గార్డు గ్రూపులున్నాయని, ఒకవేళ గువాంపై దాడిని అమెరికా అడ్డుకుంటే, తమ తరువాతి టార్గెట్ ఆ దేశ ప్రధాన భూభాగమే అవుతుందని హెచ్చరించారు.
తమ ప్లాన్ కు అధినేత నుంచి ఆమోదం లభించిన వెంటనే ప్రపంచ పటం నుంచి గువాం కనిపించకుండా పోతుందని అన్నారు. కాగా, మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఉత్తర కొరియాపై విరుచుకుపడుతూ, తమను ఉద్దేశించి మాట్లాడటం మంచిది కాదని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిగానే నార్త్ కొరియా ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.