: ఆ ఒక్క పదవి తప్ప అన్నీ అనుభవించా: వెంకయ్యనాయుడు
తన జీవితంలో ఒక్క పదవిని తప్ప మిగతా అన్ని పదవులూ తనను వెతుక్కుంటా వచ్చాయని కేంద్ర మాజీ మంత్రి, మరో మూడు రోజుల్లో భారత ఉప రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఒక్క ప్రధానమంత్రి పదవి తప్ప మిగతా అన్ని పదవులూ తాను చేపట్టానన్న అర్థంలో ఆయన మాట్లాడారు. కష్టపడటం వల్లనే ఇన్ని రకాలైన పదవులు తనకు లభించాయని, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప్రజలకు సేవ చేసే అదృష్టం లభించిందని అన్నారు.
నిన్న ఉదయం తిరుమలలో, ఆపై తిరుపతిలో, సాయంత్రం నెల్లూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థుల నూతన వసతి గృహాన్ని, 300 పడకల ప్రసూతి ఆస్పత్రిని ప్రారంభించి, మెడికల్ కళాశాల విదార్థులకు ట్యాబ్ లు అందించారు. స్త్రీలను గౌరవించడం భారత సంప్రదాయమని, వారికి అవకాశమిస్తే వారి సత్తా ఏంటో తెలుస్తుందని, ప్రతి ఒక్కరూ మహిళలపై ఆధారపడి బతుకుతున్న వారేనని వెంకయ్యనాయుడు అన్నారు. జీతం తీసుకుంటున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, వైద్య చికిత్సల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోజులు రావాలని అన్నారు.