: భారత్ తో ఇక మ్యాచ్ లు ఆడమని చెప్పండి... ఐసీసీ బెదిరిపోతుంది: పీసీబీకి జావెద్ మియాందాద్ సలహా
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కు ఆ దేశ మాజీ దిగ్గజ ఆటగాడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం వియ్యంకుడు జావెద్ మియాందాద్ మహా గడసరి సలహాలు ఇస్తున్నాడు. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్ లు జరగని సంగతి తెలిసిందే. భారత్ తో ఆడి, నిధులు పోగేసుకోవాలని విశ్వప్రయత్నాలు చేసిన పీసీబీ ఆశలను బీసీసీఐ వమ్ముచేసింది. దీంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా పీసీబీ ఆశలు నెరవేరలేదు. దీంతో బీసీసీఐతో లాభం లేదని భావించిన జావెద్ మియాందాద్... భారత్ ను లొంగదీసుకోవాలంటే ఐసీసీని మెడలు వంచేలా చేయాలని సూచించాడు. భారత్ తో ఎలాంటి మ్యాచ్ లు ఆడమని ఐసీసీకి తేల్చి చెప్పాలని డిమాండ్ చేశాడు.
ఐసీసీ నిర్వహించిన కీలక సిరీస్ లలో కూడా భారత్ తో ఆడమని స్పష్టం చేయమని చెప్పాడు. దీంతో ఐసీసీ దిగివస్తుందని, భారత్-పాక్ మ్యాచ్ లు నిర్వహించడం వల్ల వచ్చే ఆదాయాన్ని వదులుకోవడం ఇష్టంలేని ఐసీసీ భారత్ ను ఒప్పిస్తుందని సూచించాడు. అలా చేయకుండా బీసీసీఐని ఏమీ చేయలేమని అన్నాడు. ఐసీసీలో బీసీసీఐ బలం ఎక్కువని, ఐసీసీని ధిక్కరిస్తే దిగివస్తుందని చెప్పాడు. అలా చేయడం వల్ల పీసీబీకి ఐసీసీలో గౌరవం పెరుగుతుందని, పీసీబీ మాట వింటుందని సూచించాడు. అలా చేయకుండా భారత్ పై 100 కోట్ల పరువు నష్టం వేసినా ఎవరూ పట్టించుకోరని అన్నాడు.
ఇలా చేయడం వల్ల పీసీబీ కోల్పోయేదేమీ లేదని, ఇలా తిరుగుబాటు చేయడం వల్ల ఐసీసీ దారికి వస్తుందని సూచించాడు. దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐసీసీని ధిక్కరిస్తే...ఇప్పటికే పాక్ లో ఆడేందుకు ఏ దేశమూ ముందుకు రావడం లేదని, తరువాత పాక్ తో ఆడేందుకు కూడా ఎవరూ ముందుకురారని, దీంతో నష్టపోయేది ఐసీసీయా? లేకపోతే పీసీబీనా? అన్నది జావెద్ మియాందాద్ కు తెలియడం లేదని పేర్కొంటున్నారు. ఇంతకంటే బుర్రతక్కువ సలహా ఇంకోటి లేదని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు.