: ఇంధనేతర ఆదాయాలపై దృష్టిసారించిన సౌదీ అరేబియా... టూరిజం, ఎకనామిక్ జోన్ల నిర్మాణంపై ఆసక్తి!
దశాబ్దాలుగా ముడి చమురు అమ్మకం ద్వారా ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటున్న సౌదీ అరేబియా తన రూటు మార్చింది. ఇంధనేతర ఆదాయాలపై దృష్టి సారించి ఆర్థిక వ్యవస్థను అభివృద్ది చేయడానికి ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా టూరిజం, ఎకనామిక్ జోన్ల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే `సౌదీ విజన్ 2030` పేరున భారీ వ్యయంతో రెండు ప్రత్యేక ఎకనామిక్ జోన్లను నిర్మిస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది.
అలాగే టూరిజం అభివృద్ధి కోసం కొన్ని కొత్త ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు సౌదీ పేర్కొంది. వీటిలో ముఖ్యంగా ఎర్ర సముద్ర తీర ప్రాంత మార్గంలో టూరిజం సెక్టార్ల అభివృద్ధి, మక్కా సందర్శనకు వచ్చే వారి సౌకర్యార్థం అల్ ఫైజాలియా నిర్మాణం, రియాద్‌లో ప్రత్యేక ఎంటర్టైన్మెంట్ సిటీ వంటి ప్రాజెక్టులు చేపట్టనుంది. అలాగే ఆర్థిక రంగ అభివృద్ధిలో భాగంగా కింగ్ అబ్దుల్లా ఎకనామిక్ సిటీ, కింగ్ అబ్దుల్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ ఎకనామిక్ సిటీల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలుస్తోంది.