: వ్యూహం మార్చిన పాక్ మాజీ ప్రధాని.. రోడ్ షోకు సిద్ధమవుతున్న షరీఫ్!
అవినీతి అరోపణలతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయిన నవాజ్ షరీఫ్ ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రజల్లో తనకున్న బలం ఏపాటిదో తెలుసుకునేందుకు రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే వారమే ఆయన రోడ్ షో ప్రారంభం అవుతుంది. ఇస్లామాబాద్-లాహోర్ మధ్య ఆయన రోడ్ షో జరగనున్నట్టు తెలుస్తోంది.
నిజానికి సుప్రీంకోర్టు తనపై అనర్హత వేటు వేసిన వెంటనే నవాజ్ రోడ్ షో నిర్వహించాలని భావించారు. అయితే న్యాయవ్యవస్థతో అనవసర ఘర్షణ వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని భావించి వెనక్కు తగ్గారు. అంతేకాక రోడ్ షో వల్ల భద్రతా పరమైన సమస్యలు కూడా ఉంటాయని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. పదవి కోల్పోయిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి ముర్రే వెళ్లిపోయిన షరీఫ్ ఇటీవల ఇస్లామాబాద్ వచ్చారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారి అభిమానాన్ని చూసిన షరీఫ్‌లో మళ్లీ రోడ్ షో ఆలోచన మొగ్గ తొడిగినట్టు చెబుతున్నారు.