: చైనీయులను బెంబేలెత్తించిన కోతి... గ్రామంలో బీభత్సం.. వణికిపోయిన ప్రజలు!
అసలే కోతి.. ఆ పై కల్లు తాగింది.. అన్నది సామెత. మరి చైనా కోతి కల్లు తాగిందో లేదో తెలియదు కానీ వారిని మాత్రం బెంబేలెత్తించింది. బయటకు రావాలంటేనే భయపడేంతలా వణుకు పుట్టించింది. కొన్ని గంటల పాటు గ్రామంలో హల్ చల్ చేసింది. దానిని చూసి ప్రజలు భయంతో వణికిపోయారంటే అది సృష్టించిన బీభత్సకాండ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
నైరుతి చైనాలోని గంగ్‌ష్వన్ డులాంగ్ అటానమస్ కౌంటీలోని గలబో గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. కనిపించిన వారిని కనిపించినట్టు కొరికిపడేసిందీ మర్కటం. కాళ్ల పిక్కలు, చెవులు కొరికేసింది. ఇళ్లలోకి చొరబడి నానా హంగామా చేసింది. పండ్లు, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లింది. వారి పెంపుడు జంతువులపై దాడి చేసి గాయపరిచింది. వాటి మేతను కూడా లాక్కెళ్లింది. కోతి దాడిలో గాయపడిన వారు ఆసుపత్రులకు పరిగెట్టి రేబిస్ టీకాలు ఇప్పించుకున్నారు. ‘అస్సాం మకాఖ్’ అనే అరుదైన జాతికి చెందిన ఈ కోతిపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామంలో కాపుకాసి మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. అనంతరం జూలో అప్పగించారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.