: ఇలాంటివి మళ్లీ జరిగితే ‘బిగ్ బాస్’ నుంచి తప్పుకుంటా: కమలహాసన్
తమిళ్ ‘బిగ్ బాస్’ షోలో నటి ఓవియా ఆత్మహత్యాయత్నం చేసిందన్న వార్త కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమలహాసన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు ఇస్తున్న టాస్క్ లపై అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, పోటీలో పాల్గొనే వారు మానసిక వికలాంగులుగా నటించాలని బిగ్ బాస్ బృందం టాస్క్ ఇచ్చిందని, ఇలాంటి టాస్క్ లు చేసి వికలాంగుల మనోభావాలను దెబ్బతీయవద్దని, ఈ తరహా టాస్క్ లు మళ్లీ ఇవ్వవద్దని బిగ్ బాస్ బృందాన్ని కోరుతున్నానని అన్నారు.
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరిగితే ఈ షో నుంచి తాను తప్పుకుంటానని కరాఖండిగా చెప్పారు. అయితే, సినిమాల్లో వికలాంగుల పాత్రలు పోషిస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే.. అలాంటి పాత్రలను తన సినిమాల్లో కామెడీగా చూపించనని అన్నారు. తన సినిమాలో వికలాంగుడి పాత్ర కనుక ఉంటే అతన్నే హీరోగా పెట్టి సినిమా తీస్తాను అని కమల్ చెప్పుకొచ్చారు.