: తమిళ 'బిగ్‌బాస్' హౌస్‌లో పార్టిసిపెంట్ ఆత్మహత్యాయత్నం... ఇంటి నుంచి బయటికి పంపిన నిర్వాహకులు!
కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్ కార్యక్రమంలో ఓ పార్టిసిపెంట్ ఆత్మహత్యాయత్నం చేసింది. పార్టిసిపెంట్‌గా ఉన్న ఓవియా హెలెన్ హౌస్ ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇలా చేయడం ఇతర పార్టిసిపెంట్ల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉండటంతో ఆమెను హౌస్ నుంచి బయటికి పంపేశారు షో నిర్వాహకులు.
గత కొన్నిరోజులుగా ఇతర పార్టిసిపెంట్లు తన పట్ల చూపిస్తున్న ప్రవర్తన వల్ల మానసికంగా సంఘర్షణకు లోనవుతున్న ఓవియా, ఎలాగైనా బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటపడాలని ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ ఇంటికి ప్లంబింగ్ చేసే ఇబ్రహీం షేక్ అనే వ్యక్తి సెట్లోనే మరణించడంతో ఈ కార్యక్రమం మరోసారి వివాదాస్పదంగా మారింది. మొదట్నుంచి ఏదో ఒక వివాదంలో ఉంటున్న బిగ్‌బాస్ కార్యక్రమంపై తమిళ ప్రేక్షకులు మరోలా అభిప్రాయపడుతున్నారు. కార్యక్రమానికి పెద్దగా పేరు రాకపోతుండటంతో నిర్వాహకులే కావాలని వివాదాలు సృష్టిస్తున్నారని వారు పేర్కొంటున్నారు.