: నైజీరియన్ల మరో మోసం... బాధితురాలు హైదరాబాద్ చిత్రకారిణి
నైజీరియాకు చెందిన సైబర్ నేరగాళ్లు పన్నిన ఉచ్చులో పడి హైదరాబాద్ కు చెందిన ఓ చిత్రకారిణి మోసపోయారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, బీహెచ్ఈఎల్ రామచంద్రాపురంలో ఉండే ఓ యువతి ఆర్టిస్టు. ఆమె చిత్రాలను గీస్తూ వాటిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తుంటారు. వాటికి వచ్చే కామెంట్లపైనా స్పందిస్తుంటారు. కొన్ని నెలల క్రితం లండన్ కు చెందిన వ్యక్తినంటూ ఒకరు ఫాలోయింగ్ రిక్వెస్టు పంపగా, ఆమె అంగీకరించారు. ఆపై తనకు పెయింటింగ్స్ అంటే ఇష్టమని, మీరు గీసే చిత్రాలు బాగున్నాయని కామెంట్స్ పెట్టేవాడు. కొద్ది రోజుల్లోనే ఇద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది.
నెల క్రితం లండన్ లో పెయింటింగ్ ప్రదర్శన ఉందని, అందులో మీ చిత్రాలను వేలం వేస్తే, లక్షలు వస్తాయని నమ్మబలికాడు. దీంతో ఆమె తాను గీసిన చిత్రాలను పంపింది. ఆపై ప్రదర్శనకు ఆ చిత్రాలు ఎంపికయ్యాయని, నిర్వాహకులు విలువైన బహుమతి ఇవ్వగా, దాన్ని పంపుతున్నానని చెప్పాడు. దాన్ని సదరు చిత్రకారిణి నిజమేనని నమ్మి ఆనందించింది. ఆ మరుసటి రోజు, ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ఓ గిఫ్ట్ వచ్చిందని, కస్టమ్స్ సుంకాలు చెల్లిస్తే, ఇంటికి పంపుతామని చెప్పడంతో, అతను చెప్పిన బ్యాంకు ఖాతాలకు రూ. 1.5 లక్షలు జమ చేసింది. ఆపై అతన్నుంచి స్పందన లేకపోవడం, లండన్ వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ ఖాతా రద్దు కావడంతో, మోసపోయానని గ్రహించిన ఆమె, సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించగా, ఈ మోసం వెనుక నైజీరియన్లు ఉన్నట్టు గుర్తించిన సైబర్ క్రైమ్ అధికారులు దర్యాఫ్తు ప్రారంభించారు.