: మూడు నెలల్లో కాగ్నిజెంట్ కు రాజీనామా చేసిన 4 వేల మంది టెక్కీలు


అమెరికా కేంద్రంగా పని చేస్తున్నా, ఇండియాలో వేలాది మంది ఐటీ నిపుణులకు ఉపాధిని కల్పిస్తూ, ప్రముఖ ఐటీ సేవల సంస్థగా పేరు తెచ్చుకున్న కాగ్నిజెంట్ నుంచి, గడచిన మూడు నెలల కాలంలో 4,400 మంది టెక్కీలు రాజీనామా చేసి వెళ్లడం కలకలం రేపుతోంది. మార్చి నెలాఖరునాటికి 2.61 లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్ లో పని చేస్తుండగా, జూన్ చివరికి వారి సంఖ్య 2.56 లక్షలకు చేరింది. సాధారణ స్థాయికన్నా అట్రిషన్ లెవల్ తమ కంపెనీలో అధికంగా ఉందని అంగీకరించిన కాగ్నిజెంట్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కరెన్ మెక్ లౌగ్లిన్, ఉద్యోగులంతా స్వచ్ఛందంగానే రాజీనామాలు చేశారని అన్నారు.

బీపీఓ, ట్రయినీ విభాగాల నుంచి అత్యధికులు వెళ్లిపోయారని, వార్షిక అట్రిషన్ రేటు 23.6 శాతంగా ఉందని ఆయన అన్నారు. వీరి రాజీనామా సంస్థ సేవలపై ఎటువంటి ప్రభావాన్నీ చూపబోదని, తమ డిజిటల్ బిజినెస్ నిరాటంకంగా కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సమీప భవిష్యత్తులో అట్రిషన్ రేటు దిగివస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం మేలో 'వాలంటరీ సపరేషన్' పేరిట ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని సంస్థ కోరగా, పలువురు ఉన్నతోద్యోగులు వీడిన సంగతి తెలిసిందే. కాగా, స్వచ్ఛందంగా రాజీనామాలు చేసే వారికి 9 నెలల వేతనాన్ని సంస్థ అందించింది.

  • Loading...

More Telugu News