: మమ్మల్ని ఎంతకు కొన్నావ్? కేసుల్లో చిక్కుకుపోయి.. పిచ్చెక్కి మాట్లాడుతున్నావ్: జగన్ పై ఆదినారాయణరెడ్డి ఫైర్
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి ఆదినారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. 'తండ్రి వయసున్న చంద్రబాబును రోడ్డుపై కాల్చి చంపాలని అంటావా?.. నీ కన్నా వీధి రౌడీలే నయం' అంటూ మండిపడ్డారు. విశ్వసనీయత, కుటుంబ రాజకీయాల గురించి జగన్ మాట్లాడుతున్నారని.... ఏ కుటుంబానికి ఎలాంటి చరిత్ర ఉందో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ జగన్ కు సవాల్ విసిరారు. వైయస్ చనిపోయిన తర్వాత నీవు సీఎం కావాలనే ఉద్దేశంతో... నీకు మద్దతు పలికిన తమను ఎంత డబ్బిచ్చి కొనుక్కున్నావో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కావాలన్న తపనతో పిచ్చెక్కి మాట్లాడుతున్నావంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీవు గోలీలు ఆడుకునే వయసులో నీ తాత, తండ్రి చేసిన అరాచకాల చరిత్ర నీకు తెలియదా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో గెలిచి వైసీపీలోకి వచ్చినప్పుడు రాజీనామాలు ఎందుకు కోరలేదని జగన్ ను ఆది ప్రశ్నించారు. అప్పుడు లేని నైతికత ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు. నీకు నైతికత ఉంటే ముందు నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ సులోచనను రాజీనాయా చేయించు అంటూ ఎద్దేవా చేశారు.
చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు హైదరాబాదులో ఎన్ని హత్యలు చేయించారో గుర్తులేదా? అని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన భూమన, బొత్స, రోజాలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు నంద్యాలలోనే తిష్ట వేశారని... అధికార పార్టీకి చెందిన నేతలు మాత్రం ప్రచారానికి రాకూడదా? అని ప్రశ్నించారు. నీకు అన్ని తెలివితేటలు ఉంటే ప్రశాంత్ కిషోర్ ను ఎందుకు తెచ్చుకున్నావంటూ జగన్ పై సెటైర్ వేశారు. కేసుల్లో చిక్కుకుపోయి... పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావని అన్నారు. జగన్ ఓ జగత్ కంత్రీ అని విమర్శించారు.