: శిల్పా బ్రదర్స్ తరువాత ఆనం సోదరుల వంతు... బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు!


ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరగబోదని స్పష్టమవుతున్న నేపథ్యంలో, ఫిరాయింపులకు తెరలేవగా, ఇటీవల కర్నూలు జిల్లాలో పేరున్న తెలుగుదేశం పార్టీ నేత శిల్పా మోహన్ రెడ్డి, ఆపై నిన్న ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా, నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి సోదరులు కూడా వైకాపా వైపు చూస్తున్నారన్న వార్తలు గుప్పుమనగా, వారిని బుజ్జగించేందుకు స్వయంగా సీఎం నారా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

తమకు పార్టీలో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదని, ఇస్తామన్న ఎమ్మెల్సీ సీట్లను కూడా ఇవ్వలేదని గత కొంత కాలంగా ఆనం సోదర ద్వయం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి వస్తే, కనీస మర్యాద లేకుండా పోయిందని, తమను అధికారిక కార్యక్రమాలకు దూరం పెట్టారని వారు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్టు సమాచారం.

ఇక వారిని పార్టీలోనే ఉంచేందుకు రంగంలోకి దిగిన చంద్రబాబు, ఆనం రామనారాయణరెడ్డికి ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉండగా, గతంలో జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన మంత్రి పదవిని పొందిన సంగతి తెలిసిందే.

ఇక పదవుల పందేరంలో భాగంగా, రెండు పదవులు ఉన్న కళాను అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చంద్రబాబు గతంలోనే ఆదేశించినట్టు సమాచారం. ఇదిలావుండగా, తనకు అధ్యక్ష పదవి వద్దని, ఎమ్మెల్సీ, మంత్రి పదవి కావాలని ఆనం బ్రదర్స్ పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోకుంటే, పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News